RAINS: చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగగా.. రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఒకరి మృతి చెందగా.. జలాశయాలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తటంతో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి.
విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జి.కె.వీధి మండలం చట్రాయిపల్లి గ్రామంలో కొండ చరియలు విరిగిపడటంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో కుమారి అనే యువతి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరంలో 14 సెం.మీ. వర్షం కురిసింది. చింతపల్లి 13.7 సెం.మీ., గంగవరం 12.6, ముంచంగిపుట్టు 12.1, విజయనగరం జిల్లా గోవిందపురం 13.9, పెదనందిపల్లి 12.3, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట 13.1, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 11.5. సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సీలేరు-దుప్పిలవాడ మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. 16 కి.మీ. రహదారిలో 12 చోట్ల రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన మార్గంలో మడిగుంట, చింతలూరు, చింతపల్లి సమీపంలోని అంతర్ల, పెంటపాడు వద్ద భారీ వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేశారు. మడిగుంట, పెంటపాడు వద్ద నిర్మించిన వంతెనలు కొట్టుకుపోయాయి. గూడెంకొత్తవీధి మండలం చామగెడ్డ వద్ద వంతెన నేలమట్టమైంది. గూడెంకొత్తవీధి నుంచి సీలేరు మార్గంలో మూడు చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారిపై పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. సీలేరునుంచి గూడెంకొత్తవీధికి రాకపోకలు స్తంభించాయి. అనకాపల్లి జిల్లా ఖండివరం-మాడుగుల రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయి.. రోడ్డుకు భారీ గండి పడింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం వద్ద రెల్లిగడ్డ పొంగి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నుంచి 30 గ్రామాలకు, పొందూరు-శ్రీకాకుళం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com