AP: నేడు ఏపీలో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
తీవ్ర అల్పపీడనం
పశ్చిమమధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనం ఉత్తర దిశగా కదలనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఉత్తర-ఈశాన్య దిశగా వాయుగుండంగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో నీట మునిగిన పంట
మరోవైపు భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. పొలాల్లో కోసి ఉంచిన వరి కుప్పలు తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం తాజాగా వాయుగుండంగా బలపడినట్టు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని వేలాది హెక్టార్లలో వరిపొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిన్న సాయంత్రానికి చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 450 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు 640 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. వర్షాలు నేడు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com