RAINS: మరో రెండు రోజులు వర్షాలు

RAINS: మరో రెండు రోజులు వర్షాలు
X
హైదరాబాద్‌ లో వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ... ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంది. గత రెండు మూడు రోజులుగా ఓవైపు ఎండలతో పాటు మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో… తీవ్రస్థాయిలో పంట నష్టం వాట్లిలింది. ఇక ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ద్రోణి ప్ర‌భావంతో రాగ‌ల 24 గంట‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్తరు వాన‌లు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది. కాగా, మొన్నటి వ‌ర‌కు ఎండ‌ల‌తో వేడెక్కిన న‌గ‌ర వాతావ‌ర‌ణం ద్రోణి ప్ర‌భావంతో కొంత చ‌ల్ల‌బ‌డింది.

ఈ జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణలో చూస్తే ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే, శుక్రవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 30 నుంచి 50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక శనివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి తిరుపతి నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి హరీష్ రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. రైతులు పన్నాల తిరుపతి రెడ్డి, రాజీ రెడ్డి, చెరుకు జాన్, సత్తి రెడ్డి పాల్గొన్నారు.

భారీ వర్షాలు..విమానాల దారి మళ్లింపు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో చెట్లు నేలకూలాయి. నగరానికి వచ్చే 20 విమానాలను అధికారులు దారి మళ్లించగా, 10 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దారి మళ్లించిన ఫ్లైట్లలో ఇండిగో 10, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 4, అకాసాకు చెందిన 2, ఎయిర్ ఇండియాకు చెందిన 2, దేశీయంగా 18 విమానాలు ఉన్నాయి.

Tags

Next Story