ఆంధ్రప్రదేశ్‌లో కుంభవృష్టి.. వరదల బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌లో కుంభవృష్టి.. వరదల బీభత్సం
ఆంధ్రప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. వరుస అల్పపీడనాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లా..

ఆంధ్రప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. వరుస అల్పపీడనాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని నందిపల్లె, పాలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. తమ్మడపల్లెకు చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి వంతెన దాటుతుండగా జారిపడి వాగులో గల్లంతయ్యాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం మాముడూరులో భారీ వర్షం పడటంతో వాగులు ఉప్పొంగాయి. మాముడూరు- గుత్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. వరదల కారణంగా పెన్నా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు నగరంలో ఆకస్మికంగా నీళ్లు రావడంతో జనార్ధన్ రెడ్డికాలనీ, భగత్ సింగ్ కాలనీ, వర్నకటేశ్వరపురం జలమయం అయ్యాయి. అటు జలదిగ్బంధంలో ఉన్న సంగం మండలం వీర్లగుడిపాడును కలెక్టర్ సందర్శించారు. రాయలసీమ జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు వరద నీరు సోమశిల ప్రాజెక్టుకు అధికంగా వచ్చి చేరుకుంటుందని తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే విధంగా పెన్నా నదికి వరద ఉధృతి కొనసాగుతుందన్నారు. అటు పెన్నా నదిలో చిక్కుకున్న పది మందిని సహాయక బృందాలు రక్షించాయి.

ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం నెల్లూరు జిల్లా ప్రజానీకానికి శాపంగా మారింది. సోమశిల జలాశయం నుంచి సరైన సమయంలో నీటిని విడుదల చేసి ఉంటే నెల్లూరు మునిగే పరిస్థితి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. నెల్లూరు జల దిగ్బందంలో చిక్కుకోవడానికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.

సోమశిలకు వరద ఉధృతి పెరగడంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు.. ఇదే అదునుగా కొందరు మందుబాబులు రిజర్వాయర్‌ దగ్గర కాజ్‌వేపై నడుస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. భారీ ఎత్తున వస్తున్న వరద నీరుకు ఎదురుగా వెళ్లారు. కాజ్‌వేపై నడుస్తూ... దాదాపుగా ప్రవాహంలోకి వెళ్లినంత పని చేశారు. అయితే అందులో ఇద్దరు ప్రవాహానికి కాస్త భయపడ్డా.. ఒకడు మాత్రం వెర్రిగా రెచ్చిపోయాడు. చివరకు మిగతా ఇద్దరు అతణ్ని వెనక్కి లాక్కొచ్చారు. అయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో ఆ ముగ్గురు కాజ్‌వే పైకి ఎలా వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్‌ సమీపంలోని కోనేరుపేటలో చిన్నపాటి వర్షానికే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారికి అనుకొని ఉన్న వర్షపు నీటి డ్రెయిన్‌ను... కోనేరుపేటలోకి మళ్లించడంతో నివాసాలు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story