ఏపీకి మరో ముప్పు వచ్చి పడుతుంది..24 గంటల్లో..

ఏపీకి మరో ముప్పు వచ్చి పడుతుంది..24 గంటల్లో..

ప్రతీకాత్మక చిత్రం 

ఆంధ్రప్రదేశ్‌ను వరుణుడు వణికిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీకి మరో ముప్పు వచ్చి పడుతుంది. మరో 24 గంటల్లో వాయుగుండం ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంటలు నీట మునగటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాళం కష్టించి పండించిన పంటలను నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం కారణంగా శ్రీశైలం డ్యాం నిండుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. ఇటు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భారీ వరదల కారణంగా బెడవాడలోని పలు కాలనీలు, కృష్ణలంక, రాణిగారితోట సహా నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలోఇప్పటి వరకు 22 వేల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు 15 మండలాల్లోని పంట పొలాలు కృష్ణమ్మ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ప్రధాన పంటలతో పాటు వాణిజ్య పంటలు, పండ్ల తోటలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి.

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో వాణిజ్య పంటలు నీట మునిగాయి. పసుపు, తమలపాకు, కంద, బొప్పాయి, అరటి పంటలపై ఒండ్రు మట్టి పేరుకుపోయింది. వరద ఉధృతి తగ్గడంతో పంటల వద్దకు వచ్చిన రైతులు వాటిని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. నాలుగైదు రోజులుగా వరద ముంపులో ఉన్న పంటలు క్రమంగా రూపురేఖలు కోల్పోతాయని, తాము పెట్టిన పెట్టుబడులన్నీ కృష్ణార్పణం అయ్యాయని రైతన్నలు వాపోతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 70 వేల 500 ఎకరాలు నీట మునిగాయి. 437 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరపి లేని వర్షాలకు వరి పంటతో పాటు వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్రేయపురం మండలంలో కంద, పసుపు, అరటి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైతులు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేలాది హెక్టార్లలో రైతులకు పంట నష్టం జరిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుకుంటున్నారు.

Tags

Next Story