ఏపీలో కుంభవృష్టి.. ప్రకాశం జిల్లాలో భారీగా పంటనష్టం

ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ పరిధిలో పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకొల్లు మండలంలోని అప్పేరు, చిన వాగులు ఉప్పొంగుతున్నాయి. కారంచేడు అలుగు వాగు ఉధృతికి లోతట్టు ప్రాంత పొలాలు నీట మునిగాయి. గత 20 గంటలుగా కురుస్తున్న వర్షాలకు అడుసుమల్లి గ్రామంలో రామాలయం ప్రహరి గోడ విరిగిపడింది.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పెంచికలపాడు చెరువుకట్ట తెగింది. దీంతో 150 ఎకరాల్లో కోసి కుప్పలుగా పెట్టిన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. నాసిరక నిర్మాణం వల్లే కట్ట తెగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడప నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలధాటికి ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బుట్టాయగూడెంలో కొండవాగులో ఓ కారు చిక్కుకుంది. ఓ వ్యక్తి కారుతోపాటు కొట్టుకుపోగా... మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం మునమాక వద్ద భారీ వానలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విప్పర్లపల్లితో సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com