చిత్తూరు జిల్లాపై 'నివర్' తీవ్ర ప్రభావం.. కుంభవృష్టి..
చిత్తూరు జిల్లాపై నివర్ తుపాను... తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత కురుస్తుంది. భారీ ఈదురుగాలులకు జనం బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా గత రాత్రి తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 9, 10, 14, 15 కిలోమీటర్ల దగ్గర బండరాళ్లు పడ్డాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. దీంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో... ఇళ్లలోని వర్షపు నీరు చేసింది. తిరుమలలోని వ్యాపారులు... తమ దుకాణాలను మూసివేశారు. గోగర్భం డ్యాం నిండటంతో... అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
భారీ వర్షం కారణంగా తిరుమలలోని బాలాజీ నగర్‌లో ఉన్న కమ్మూనిటీ హాల్ ప్రహారీ గోడ కుప్పకూలింది. ప్రక్కనే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గోడ కూలే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఇటు సత్యవేడు, రేణిగుంటలో 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com