Rayalaseema Rains : రాయలసీమలో భారీ వర్షాలు.. మిద్దె కూలి ఒకరి మృతి..

Rayalaseema Rains : రాయలసీమలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో కడప జిల్లా జమ్మలమడుగు వద్ద పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గండికోట జలాశయానికి.. పెన్నా, చిత్రావతి నుండి వరద పోటెత్తింది. గండికోట జలాశయంలో 26 టీఎంసీల నీరు నిల్వఉంచి మిగిలిన వరదని మైలవరం జలాశయంనకు అధికారులు విడుదల చేస్తున్నారు.
మైలవరం జలాశయంలో 2.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి 30వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేయడంతో పలు గ్రామాలకు అంతరాయం ఏర్పడింది. జమ్మలమడుగు - ముద్దనూరు రహదారి వద్ద అప్రోచ్‌రోడ్డు వరదకు కొట్టుకుపోయింది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేయడంతో.. జమ్మలమడుగు చుట్టూ ప్రక్కల ఉన్న 14 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. అదేవిధంగా చాగల్లు రిజర్వాయర్ నుండి 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల పెన్నా పరివాహక ప్రాంతాల్లో గ్రామాలకు వరద ఉధృతి పెరిగింది. పెన్నానది ఒడ్డున కస్తూర్బా స్కూల్ ప్రమాదపు అంచునకు చేరింద. జాయ్ క్లబ్ పార్కు పూర్తిగా నీట మునిగింది.
కర్నూలు జిల్లా ఆలూరులో వర్షానికి ఇళ్లు కూలి మహిళ మృతి చెందింది. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతిరాలి బాధిత కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మ డిమాండ్ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com