ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల పాలిట శాపంలా మారిన అతివృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల పాలిట శాపంలా మారిన అతివృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల పాలిట అతివృష్టి శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించిన రైతులను వరుసగా కురిసిన భారీ వర్షాలు అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులు అప్పుల పాలై రోడ్డున పడ్డారు. గుంటూరు జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప పంట పూర్తిగా దెబ్బతింది. పంట వేసిన 15 రోజులకే వర్షాలు, వరదలు ముంచెత్తడంతో పంట మొత్తం వర్షార్పణం అయింది. పత్తి, కంది, కూరగాయలు, అరటికి అధిక మొత్తంలో నష్టం కలిగింది. పల్నాడు, లంక గ్రామాల్లో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది.

అటు..తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు ఉగ్రరూపం రైతులకు భారీనష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. మెయిన్ కెనాల్‌కు 34 చోట్ల గండిపడడంతో వాటిని యుద్ధప్రాతిపదికన పూడ్చే ప్రయత్నాలు చేసినా అప్పటికే అపారనష్టం వాటిల్లింది. కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం సహా మరికొన్ని మండలాలపై ఏలేరు వరద పెను ప్రభావాన్నే చూపించింది. జిల్లావ్యాప్తంగా చూస్తే 30 వేల హెక్టార్లలో వరి, 12 వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట చేతికొచ్చే దశలో ముంచెత్తిన ఈ విపత్తుతో మరింతగా అప్పుల్లో కూరుకుపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు క్రాప్ ఇన్స్యూరెన్స్ అందించాలని వేడుకుంటున్నారు.

మరోవైపు.. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పంట నష్టం అపారంగానే ఉంది. 13 వేల 975 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి, అరటి, పసుపు, మిర్చితోపాటు కూరగాయలు పూర్తిగా నీటిలో నానుతున్నాయి. ఇక 621 హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనాకు వచ్చారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాలు ముంపు బారినపడ్డాయి. తూర్పుతో పోలిస్తే పశ్చిమలో నష్టం కాస్త తక్కువే ఉన్నా వరద ఉధృతి తగ్గేవరకూ జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎర్రకాలువ ప్రభావంతో రెండు మూడేళ్లకు ఒకసారి పంటలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుని.. శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story