RAINS: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై భారీగా ఉండనుంది. దీని ఎఫెక్ట్ కారణంగా రానున్న నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని.. ఇది సముద్ర ఉపరితలం నుంచి పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో...
ఈ అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు భారతీయ వాతావరణ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో బుధవారం, గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అధికారులు వెదర్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో తేలికపాటి జల్లులు
అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేదు. అయితే రుతుపవనాలు కారణంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అయితే గడిచిన వారం రోజుల్లో తెలంగాణలో క్రమంగా శీతలగాలులు పెరుగుతూ.. రాత్రి ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల మేర తగ్గుతున్నాయి.
తమిళనాడులో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే నాలుగు రోజులు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. చెన్నైతో సహా 12 జిల్లాల్లో బుధవారం కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 24 గంటల్లో చెన్నై పెరుంగుడిలో అత్యధికంగా 8 సెం. మీ వర్షపాతం నమోదైంది. ఇటు వేళచ్చేరి, ఆలందూర్, పట్టినప్పాక్కం, మైలాపూర్, మందవెళి, తిరువొత్తియూర్ తదితర చోట్ల గాలులతో కూడిన వర్షం పడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com