రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్ర మవుతోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అటు ఉత్తర కోస్తా జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో పలు చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీగా వానలు పడుతున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
తెలంగాణలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కుండపోత వానలకు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.. చేతికందే సమయంలో పంట వర్షం పాలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. మెదక్, సిద్దిపేట, గద్వాల జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్ అర్బల్, రూరల్, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మరోసారి వణికింది.. ఉదయం నుంచి మేఘాలు దట్టంగా ఆవరించడంతోపాటు వాతావరణం చల్లబడింది.. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురిసింది.. కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.. ఇటు మియాపూర్ నుంచి అటు వనస్థలిపురం వరకు.. ఉప్పల్ నుంచి ఇటు గచ్చిబౌలి వరకు కుండపోత కురిసింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. పలు చోట్ల వర్షపునీరు నిలిచిపోయింది.. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అలెర్ట్‌గా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు.
ఇక ప్రాజెక్టులకు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది.. శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. అధికారులు మూడు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌కు లక్ష క్యూసెక్కులకుపైగానే ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.90 అడుగుల మేర నీరుంది. 214.8540 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులు దిగువకు లక్షా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం, ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు 4 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి 59,892 క్యూసెక్కుల ప్రవాహాన్ని స్పిల్ వే ద్వారా నదిలోకి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.4 టీఎంసీల నీరుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com