TTD: తిరుమలలో భారీ వర్షాలు.. టీటీడీ కీలక హెచ్చరిక

TTD: తిరుమలలో భారీ వర్షాలు.. టీటీడీ కీలక హెచ్చరిక
X
వర్షాల ధాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు... ఘాట్‌ రోడ్డులో జాగ్రత్తగా ఉండాలన్న టీటీడీ

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో హరిణికి సమీపంలో బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా వాహనాలు నడపాలని టీటీడీ సూచించింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీహరిపాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలు టీటీడీ నిలిపేసింది.


జలమయమైన తిరుపతి

ఎడతెరపిలేని వానలతో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్‌లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది. వెస్ట్‌ చర్చి రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది.

రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ

మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Tags

Next Story