RAINS: ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయు "గండం"

RAINS: ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయు గండం
X
ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం... అప్రమత్తమైన అధికారులు

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని పలు జిల్లాలను వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి. ప్రస్తుతం వాయుగుండం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా కదులోతంది. గంటలకు ఏడు కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది కళింగపట్నానికి దాదాపు 250కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో అటు కోల్‌కతా నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు జోరు వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం కళింగ పట్నానికి కొద్ది దూరంలో ఉన్న వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తీరం దాటి ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ మీదుగా పయనిస్తోంది. అక్కడ బలహీన పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందుకే దీని ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూసిస్తోంది.

పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నేడు(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ (పునరావాస కేంద్రాలు & ముంపు ప్రాంతాలలో పాఠశాలలు), బాపట్లలోని కొన్ని మండలాల్లోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

తెలంగాణలోనూ...

రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. నేడు(సోమవారం) ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది.

Tags

Next Story