TTD: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

కలియుగ వైకుంఠ దైవం కొలువైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 29 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 66,715 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24,503 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీకి వచ్చిన ఆదాయం రూ. 4.06 కోట్లు.
లడ్డూ తయారీపై TTD కీలక ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో శ్యామలరావు తిరుమల లడ్డూ తయారీపై కీలక ప్రకటన చేశారు. డయల్ యువర్ EO కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతపై రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా టూరిజం కోటాలో అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తించిన బోర్డు ఆ కోటాను రద్దు చేసిందని తెలిపారు.
డిసెంబర్ 30 నుంచి తిరుమలలో అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
పరకామణిలో రూ. 100 కోట్ల కుంభకోణం
తిరుమల పరకామణిలో రూ. 100 కోట్ల కుంభకోణం జరిగిందని.. సమగ్ర విచారణ జరపాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పరామణిలో జరిగిన స్కామ్‌పై ఆయన డీజీపీ తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. టీటీడీ పరకామణిలో డాలర్లు మాయం అయ్యాయని, ఆ ఘటనపై విచారణ చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఆ స్కామ్‌పై నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను డీజేపీకి అందజేసినట్లు చెప్పారు. పరకామణిలో రూ. 100 కోట్ల స్కామ్ జరిగిందని, ఆ డబ్బులను రహస్య అర అమర్చి అందులో పెట్టారని, తరలించిన డబ్బు మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీ తిరుమల రావును కోరినట్లు భాను ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com