HIDMA: మావోయిస్ట్ మాస్టర్ మైండ్ హిడ్మా హతం

మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్) సుందరరాజ్ పీ ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా హిడ్మా మృతిని అధికారికంగా ధ్రువీకరించారు. గెరిల్లా వ్యూహకర్త అయిన హిడ్మా మృతితో మావోయిస్టు ఉనికి పూర్తిగా కోల్పోయింది. మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్లు భద్రతా దళాలు అధికారికంగా ప్రకటించాయి. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. తాజాగా.. రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ‘‘ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డా’’ అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా. ఈలోపే ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం గమనార్హం.
భారీ సెర్చ్ ఆపరేషన్
నాలుగైదు ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం సాయంతో 10 వేల మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువూ గాలించారు. అయితే రోజుల తరబడి బలగాలు కూంబింగ్ నిర్వహించినా హిడ్మా ఆచూకీ లభించలేదు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకుంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్లు మకాం మార్చారు. భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకునే సమయాని కంటే ముందుగానే, హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారని అప్పట్లో పోలీస్ వర్గాలు భావించాయి. తెలంగాణలో తప్పించుకున్న హిడ్మా ఇలా ఏపీలో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయాడు. ఆపరేషన్ కగార్‌లో ఈ ఏడాది మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి వంటి నాయకులు పోలీస్ ఎన్ కౌంటర్లలో మరణించారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్అభయ్, ఆశన్న వంటి లీడర్లు తమ టీమ్‌లతో కలిసి పోలీసులకు లొంగిపోయారు. ఇప్పుడు హిడ్మా కూడా చనిపోయినట్లు పోలీసులు ప్రకటించడంతో.. దండకారణ్యంలో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

