HIDMA: హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జియమ్మవలసలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మాతో పాటు, అతడి భార్య మడకామ్ రాజే, దేవే, లక్మల్, మల్లా, కమ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆరుగురి మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భద్రతా బలగాల బందోబస్తు నడుమ 8 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. అక్కడికి హిడ్మా తల్లితో పాటు సోదరుడు, పువ్వర్తి గ్రామ సర్పంచ్ వెళ్లారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలోనే రంపచోవరం ప్రభుత్వ ఆస్పత్రి పరిసరాల్లో రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ నేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివతోపాటు మరో ఆరుగురు ఉన్నారు.
లొంగిపోయేందుకు హిడ్మా ప్రయత్నం
మావో అగ్రనేత హిడ్మా మృతి తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిడ్మా కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. “ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాల పై చర్చించాల్సి ఉంది..” అని లేఖలో రాసుకొచ్చాడు. ఇలా లేఖ రాసి లొంగుబాటు గురించి చర్చలు జరుపుతుండగానే హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ మరణించారు.
మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం
దండకారణ్యంలో మరోసారి రక్తం ఏరులైపారింది. హిడ్మాను మట్టుబెట్టిన 24 గంటల్లోపే మరో మావోయిస్టు అగ్రనేత హతమయ్యాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జియమ్మ వలసలో బుధవారం ఉదయం 6.30-7 గంటల సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అలియాస్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ తో పాటు.. నంబాల కేశవరావు గార్డ్ కమాండర్ జ్యోతి అలియాస్ సరిత, ఏసీఎంలు సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సాయిను అలియాస్ వాసు, అనిత, షమ్మిలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు స్పష్టం చేశారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా తెలుస్తోంది. మృతులను మావోయిస్టులు జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతి, సురేశ్, గణేశ్, వాసు, అనిత, షమ్మిగా గుర్తించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

