Farmers Maha Padayatra: మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై..

Farmers Maha Padayatra: మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై..
X
Farmers Maha Padayatra: ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నవంబరు 1 నుంచి తలపెట్టిన మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Farmers Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నవంబరు 1 నుంచి తలపెట్టిన మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

తుళ్లూరు నుంచి తిరుమలకు చేపట్టే ఈ పాదయాత్రను కరోనా నిబంధనలకు లోబడి జరుపుకోవాలంటూ షరతులు విధించింది. ఎలాంటి బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని, పాదయాత్రలో పాల్గొనేవారు ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది.

పాదయాత్రలో హ్యాండ్‌ మైక్‌ వినియోగించుకోవాలి తెలిపింది. పాదయాత్రలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మహాపాదయాత్రలో పాల్గొనేవారికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.

పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. ఆ ఉత్తర్వులు ఇచ్చే సమయంలో పిటిషనర్‌ సంస్థకు ప్రాథమిక హక్కులు ఉన్నాయన్న విషయాన్ని డీజీపీ పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డీజీపీకి స్పష్టం చేసింది.

మహాపాదయాత్రకు అనుమతిస్తే ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎ.శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ... పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన వినతిని డీజీపీ తిరస్కరించారన్నారు.

అందుకు సహేతుకమైన కారణాలు పేర్కొనలేదన్నారు. పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే ఊహాజనిత విషయాలు చెబుతున్నారన్నారు. కేవలం 200మందితో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు.

డీజీపీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే నినాదంతో పిటిషనర్లు పాదయాత్ర చేపట్టారన్నారు. మూడు రాజధానులకు అనుకూలమైన ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని వాదించారు.

ఈ మేరకు నాలుగు జిల్లాల ఎస్పీలు నివేదిక ఇచ్చారు. పాదయాత్ర కాకుండా వాహనాల్లో వెళ్లి పిటిషనర్లు స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వమే టికెట్లు ఏర్పాటు చేస్తుందన్నారు. . పాదయాత్రకు అనుమతి నిరాకరించాలంటూ కోర్టును కోరారు.

ఏఏజీ వాదనలకు వ్యతిరేకించింది హైకోర్టు. సమస్యలపై పాదయాత్ర చేపట్టడం పౌరుల ప్రాథమిక హక్కులో భాగమని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 19(1) (ఏ) (బీ)(డీ) ప్రకారం ప్రజలకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం, శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకోవడం, స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉందనితెలిపింది.

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని గుర్తు చేసింది.

Next Story