Visakha: ప్రధాని మోదీ పర్యటన నేపధ్యంలో విశాఖలో నిరసనలు..

Visakha: పోలీస్ వలయంలా మారింది విశాఖ నగరం. ప్రధాని మోదీ పర్యటన నేపధ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో.. విశాఖ నగరంలో హై టెన్షన్ నెలకొంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు..
ఉద్యమకారులను అడుగు ముందుకు కదలనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొంది.. అయితే అనుమతి లేదంటూ కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.. ఎట్టి పరిస్ధితుల్లో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామంటున్నారు ఉద్యమకారులు.. దీంతో సాగర తీరం నిరసనలతో హోరెత్తుతోంది.. మోదీ విశాఖకు రానుండటంతో నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతోంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్.
మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఉద్యమం కీలక దశకు చేరుకుంది.. ప్రధాని మోదీ, సీఎం జగన్ ఒకే వేదిక పైకి వస్తుండటంతో ఉద్యమం మరింత తీవ్రతరం దాల్చింది.. ఏపీకి గుండెకాయ లాంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా జగన్ సర్కార్ చర్యలు చేపట్టాలని అంటున్నారు కార్మికులు..
ఇప్పటికీ రైల్వే జోన్ పై కొనసాగుతున్న సందేహాలు, మరో వైపు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై మొండిచెయ్యి చూపడం, మూడు రాజధానులపై స్పష్టత ఇవ్వకపోవడం వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ప్రధాని మోదీ పర్యటనలో నిరసనలు హై ఓల్టేజ్ మధ్య కొనసాగేలా కనిపిస్తున్నాయి.
మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు బైక్ ర్యాలీని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com