TIRUPATHI: తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ

TIRUPATHI: తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ
X
వైసీపీలో అనూహ్య పరిణామాలు... ఉదయం 11 గంటలకు ఎన్నిక

తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార, విపక్షాలు పోటాపోటీగా కాలు దువ్వుతున్నాయి. వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించగా.. ఆయన టీడీపీలోకి మారుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన వైసీపీ మరో కార్పొరేటర్ భాస్కర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో పాల్గొనాల్సిన వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బంధిస్తున్నారని వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో వైసీపీ కార్పొరేటర్లను బంధించారంటూ భూమన అభినయ్ రెడ్డి వీడియో విడుదల చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని, తాము చెప్పిన వారికి మద్దతివ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కిడ్నాప్ వార్తలతో కలకలం

జనసేన ఎమ్మెల్యే కుమారుడు ఆరని మదన్ అర్ధరాత్రి వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి చిత్తూరుకు తరలించారని భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా అక్కడ ఎందుకు ఉంచారని, ఆ ప్రైవేట్ ప్రాంతం నుంచి వారిని పంపాలని కోరారు. వారిని అడ్డుకునేందుకు కూటమి నేతలు యత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి వచ్చి అంతా కంట్రోల్ చేశారు. కొంత సమయం తరువాత వైసీపీ కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుతిరిగారు. వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను ఎలాంటి నోటీసులు లేకుండా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. సురేష్ అరెస్ట్ గురించి తెలుసుకున్న అభినయ్ రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను బయటకు పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాసేపట్లో ఎన్నిక

ఇవాళ ఉదయం 11 గంటలకు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేందుకు అర్ధరాత్రి వారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా హోటల్ కు తరలించారని భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. హోటల్ బయట కారు అడ్డుపెట్టి, మనుషులను పెట్టి వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు.

ఈసీకి రోజా ట్వీట్

తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ కోసం నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి మాజీ మంత్రి రోజా కీలక విజ్ఞప్తి చేశారు. ‘వైసీపీ అభ్యర్థిని ప్రజాస్వామ్యబద్ధంగా తమ బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామంతో ఒక పార్టీ తన హక్కును కోల్పోవడమే అవుతుంది. మీరు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యం కాపాడండి’ అని ట్వీట్ చేశారు.


Tags

Next Story