SANKRANTHI: పల్లె బాట పట్టిన పట్టణం

హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనాలు వేగంగా ముందుకు సాగేలా అధికారులు అదనపు టోల్ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు సుమారు 70 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఆదివారం కావడతో నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో టోల్ వద్ద అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. కానీ వాహనాలు ఒకేసారి వేల సంఖ్యలో వస్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు చిక్కులు తప్పడం లేదు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా సాంకేతిక ఏర్పాట్లు చేయడంతో పాటు, పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా ముందుకు సాగుతున్నాయి.
70 వేల వాహనాలు
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ 70 వేల వాహనాలు టోల్ దాటి ఏపీవైపు వెళ్లినట్లు పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. నేడు, రేపు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండకుండా ఫాస్టాగ్ స్కానింగ్ వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, టోల్ ప్రాజాల వద్ద పెట్రోలింగ్ వెహికల్స్, క్రేన్, అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా.. నందిగామ వై జంక్షన్ వద్ద రోడ్డు నిర్మాణపనులు జరుగుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెహికల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. 6 ఫ్లై ఓవర్లు నిర్మిస్తుండటం కూడా ట్రాఫిక్ కు ప్రధాన కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే మార్గంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా.. యూటర్నులు తీసుకుని మరో రూటులోకి మారే క్రమంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విశాఖపట్నం వైపు వెళ్లేవారు ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇలాగైతే భోగి రోజుకైనా ఇంటికి చేరుకుంటారా భయ్యా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

