Anganwadi Workers: అంగన్వాడీ సమ్మెపై హైకోర్టు అత్యవసర విచారణ

అంగన్వాడీల సమ్మెతో రాష్ట్రంలో గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం అందకుండా పోతోందని పేర్కొంటూ... న్యాయవాది K.ఉషారాణి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం తరఫున A.G శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సమ్మెను విరమింపజేసే విషయంలో చర్చలు నిర్వహిస్తున్నామన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని... పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ R.రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 20 రోజులుగా వివిధ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని.. దీంతో పౌష్టికాహారం వృథా అవుతోందని న్యాయవాది సుధాకర్ అన్నారు.
నిన్నటి వరకూ శిబిరాలకే పరిమితమైన అంగన్వాడీల ఆందోళన రోడ్డెక్కింది. సమ్మెను నిషేధించిన ప్రభుత్వం.. షోకాజ్ నోటీసులు ఇస్తుండటంతో ఆగ్రహోదగ్రులైన అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం అపర కాళికలయ్యారు. ప్రధాన రోడ్లు.. పోలీసు స్టేషన్ల వద్ద బైఠాయించి ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలని నినదించారు. వారికి మద్దతుగా కార్మిక సంఘాలు జైల్‌భరో ఆందోళనకు పిలుపునివ్వడంతో రోజంతా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాలలో దీక్షా శిబిరం నుంచి వందలాది మంది అంగన్వాడీలు జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంగన్‌వాడీలు పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించి, 2 గంటలపాటు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజాసంఘాల రాస్తారోకోతో ట్రాఫిక్ పెద్దఎత్తున నిలిచిపోవటంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు జైల్‌భరో నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com