మంత్రి వెల్లంపల్లి తీరును ప్రశ్నిస్తున్న హిందూసమాజం

మంత్రి వెల్లంపల్లి తీరును ప్రశ్నిస్తున్న హిందూసమాజం
అంతర్వేది నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు..

అంతర్వేది నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. అయితే, దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం జరుగుతోందంటూ విపక్షాలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి.. హిందూ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి.. ప్రభుత్వ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవుళ్లకు, ఆలయాల ఆస్థులకు రక్షణ లేకుండా పోయిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వెల్లంపల్లి తీరునూ వారంతా ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు అంతర్వేదిలో బహరింగ సభ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. శుక్రవారం చలో అంతర్వేదికి పిలుపునిచ్చారు.. శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు.. బీజేపీ చలో అంతర్వేది కార్యక్రమానికి జనసేన మద్దతు తెలిపింది.. జనసేన కార్యకర్తలు చలో అంతర్వేది కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అంతర్వేది ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లోని తన నివాసంలో ధర్మపరిరక్షణ దీక్ష చేపట్టారు పవన్‌ కల్యాణ్‌. మతిస్థిమితం లేని వారి చర్యగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.. అంతర్వేది ఘటనలో పోలీసులు చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు పవన్‌ కల్యాణ్‌.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న వరుస సంఘటనలపై విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఇరుపార్టీల నేతలు, నాయకులు ప్లకార్డులతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.. అంతర్వేదిలో రథం దగ్దం అయిన ఘటన హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని.. ఈఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ఠ్‌ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

బీజేపీ నేతల అరెస్టులను నిరసిస్తూ విశాఖ బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములపై వైసీపీ కన్ను పడిందని ఆరోపించారు. సింహాచల దేవస్థానంలో రాత్రికి రాత్రి ఉత్తర్వులు వచ్చేస్తున్నాయని విమర్శించారు. అంతర్వేదిలో బహిరంగ సభ నిర్వహించాలనుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు.వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అంతర్వేదిలో రథాన్ని పిచ్చోడు తగలబెట్టారంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అంతర్వేదిలో దగ్దమైంది 5కోట్ల మంది ప్రజల మనోరథాలని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల సాంప్రదాయాలు మంటకలుస్తున్నాయని స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఇన్నిరోజులైనా ప్రభుత్వం నుంచి ఊరటనిచ్చే ప్రకటన రాకపోవడం శోచనీయమన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.బీజేపీ, జనసేన చలో అంతర్వేది పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story