VASANTHA PANCHAMI: వసంత పంచమి.. సరస్వతి ఆలయాల్లో రద్దీ

VASANTHA PANCHAMI: వసంత పంచమి.. సరస్వతి ఆలయాల్లో రద్దీ
X
చిన్నారులతో అక్షరాభాస్యం చేయిస్తున్న తల్లిదండ్రులు...

వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు సరస్వతీ ఆలయాలకు పోటెత్తుతున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. . వేకువజాము నుంచే బాసర గోదావరి నదీతీరంలో భక్తులు కనిపించారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. తెలంగాణ ఫిలిమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు కుటుంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ వసంత పంచమి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల బందోబస్తును పర్యవేక్షించారు. నేడు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.


అవంతిపురంలో ప్రత్యేక పూజలు

మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో కొలువైన శ్రీ సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే గుట్టపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలను సోమవారం నిర్వహించనున్నామని ఆలయ కమిటీ తెలిపింది.

పాయకరావుపేటలో వసంత పంచమి వేడుకలు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో వసంత పంచమి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలచే సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాసం చేయించారు. దీంతో పట్టణంలోని ప్రధాన ఆలయాలు, పాఠశాలలు పిల్లలు వారి తల్లిదండ్రులతో కోలాహలం నెలకొంది. వసంత పంచమి సందర్భంగా పిల్లలచే అక్షరాభాస్యం చేయిస్తే ప్రయోజకులు అవుతారని భక్తుల నమ్మకం.

జ్ఞాన సరస్వతి పీఠంలో..

గౌతమి ఘాట్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరస్వతి అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం గణపతి పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, సరస్వతి హోమం జరిపారు. చిన్నారులతో వారి తల్లిదండ్రులు భక్తిశ్రద్ధలతో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, సామాజిక సేవకుడు పడాల శ్రీను వేడుకలను పర్యవేక్షించారు.

Tags

Next Story