AP: ఏపీలో అంపశయ్యపై అత్యవసర వైద్యం

AP: ఏపీలో అంపశయ్యపై అత్యవసర వైద్యం
ట్రామా కేర్‌ సెంటర్ల నిర్వహణలో జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం.... పక్క రాష్ట్రాలను చూసైనా మారని వైసీపీ ప్రభుత్వం

వైసీపీ రివర్స్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్యం అంపశయ్యపై కునారిల్లుతోంది. రోడ్డు ప్రమాదాలు జరిగితే బాధితుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. ట్రామాకేర్‌ సెంటర్ల నిర్వహణలో జగన్‌ సర్కార్‌ చేతకానితనాన్ని కేంద్ర కమిటీ, కాగ్‌ బృందం బట్టబయలు చేసింది. ఉన్న కొన్ని కేంద్రాలు అరకొర సిబ్బంది, వసతుల లేమితో సతమతమవుతున్నాయి. కనీసం పక్క రాష్ట్రాలను చూసైనా జగన్‌ సర్కార్‌ పాఠాలు నేర్వడం లేదు. కాగ్‌తో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్ల భద్రతపై అధ్యయనం చేసిన కమిటీ కూడా ట్రామాకేర్‌ సెంటర్లలోని లోపాలను ఎండగట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సగటున 21 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. వాటిల్లో 8 వేల మందికిపైగా మృతి చెందుతున్నారు. 21 వేల మందికిపైనే గాయాలపాలవుతున్నారు. దాదాపు 45 శాతం జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రధానంగా చెన్నై-కోల్‌కతా, విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు అధికంగా జరిగే జాతీయ రహదారుల పొడవునా ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక ట్రామాకేర్‌ కేంద్రం పెట్టి అన్ని రకాల సదుపాయాలనూ కల్పించాలి. 24 గంటలూ పనిచేసేలా తీర్చిదిద్దాలి. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో అత్యవసర చికిత్స అందితే 54 శాతం నుంచి 90 శాతం వరకు ప్రాణాలు కాపాడవచ్చు.కానీ, సరిపడా ట్రామా కేంద్రాలు రాష్ట్రంలో లేకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. జాతీయ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు, పడకలు సౌకర్యాల కల్పనపరంగా రాష్ట్రంలోని ఒక్క ట్రామా కేంద్రమూ ప్రథమ శ్రేణిలో లేదు.


విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోనివి ద్వితీయ శ్రేణిలో....శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోనివి తృతీయ శ్రేణిలో ఉన్నాయి. వీటిల్లోనూ వైద్యులు, వైద్య పరికరాలు అరకొరగానే ఉన్నాయని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ నేతృత్వంలో ఏర్పాటైన అధ్యయన కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర నిధులతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రి, తిరుపతి జిల్లా నాయుడు పేటలోని సీహెచ్‌సీలో ట్రామాకేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో 42 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరం. వీటి పనితీరుపట్ల ‘కాగ్‌ ’ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. టెక్కలి ట్రామాకేర్‌ సెంటర్‌లో కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండటంతో క్షతగాత్రులకు తగిన సేవలు అందడం లేదు. సమీప 13 మండలాల పరిధిలో 100 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి ఉంది. 2012లో 65 లక్షలతో పూర్తిచేసిన ఈ కేంద్రంలో పరికరాల కోసం 2 కోట్లను కేటాయించారు. 2013లో ఇద్దరు వైద్యుల్ని, 12 మంది స్టాఫ్‌ నర్సులు, MNO, FNO లు 9 మందిని, ఇతర సిబ్బందిని నియమించారు. జీతాలు సరిగా రాక ఇద్దరు వైద్యులతో పాటు 12మంది స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది మానేశారు. 20లక్షల విలువైన అత్యాధునిక అంబులెన్స్‌ వినియోగించకుండానే మూలకు చేరింది.

అధిక శాతం యంత్రాలన్నీ తుప్పుపట్టడంతో బాధితులను జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. నాయుడుపేట సీహెచ్‌సీలో 2013 ఏప్రిల్‌లో 67 లక్షలతో నిర్మించిన కొత్త భవనంలో ట్రామాకేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అవసరాలకు తగ్గట్లు వైద్య పరికరాలు, నియామకాలు మాత్రం జరగలేదు. చెన్నై-కోల్‌కతా, నాయుడుపేట-తిరుపతి మార్గాల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. క్షతగాత్రులకు స్థానిక ట్రామా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి.. నెల్లూరు, చెన్నై తరలించడానికి సమయం పడుతుండటంతో చాలామంది మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story