PARAKAMANI: పరకామణి చోరీ కేసులో పెను సంచలనం

పరకామణిలో 2023 ఏప్రిల్ 29న మహాపాపం చేశాను. పెద్ద తప్పు చేశాను. ఎంత మహాపాపం చేశానో అని నేను, నా భార్యాపిల్లలు తలుచుకుని బాధపడని రోజు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మా కుటుంబం ఆ తప్పును మహాపాపంగా భావిస్తున్నాం. నేేను కేబుల్, స్థిరాస్తి వ్యాపారాలు చేశాను. మా ఆస్తిలో 90% ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి రాసిచ్చాను’ అని వెక్కి వెక్కి ఏడుస్తూ.. పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ వీడియోలో వేడుకున్నారు. ‘పరకామణిలో చిన్న చోరీ’ చేశారంటూ మాజీ సీఎం జగన్ ఇటీవల చెప్పిన తర్వాత పెద్ద తప్పు చేశానంటూ అతడే వీడియోలో పేర్కొనడం సంచలనంగా మారింది. లోక్ అదాలత్‌లో రాజీ తర్వాత, ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటూ.. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారుల విచారణకు హాజరైన తర్వాత.. తొలిసారి 2.31 నిమిషాల వీడియో ద్వారా రవికుమార్ బయటకు వచ్చారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...
‘కొందరు నన్ను బెదిరించి ఆస్తులు రాయించుకున్నట్లు ప్రచారాలు చేస్తున్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేసిన వారిపై కేసులు పెట్టాను. నా శరీరంలోని ప్రైవేటు భాగాల్లో శస్త్రచికిత్సలు చేయించుకుని అక్కడ నగదు దాచిపెట్టినట్లు మూడేళ్లుగా జరుగుతున్న అసభ్య ప్రచారంతో మా కుటుంబం మనోవేదనకు గురవుతోంది. అలా చేయలేదని నిరూపించేందుకు న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలకు ఆదేశించినా సహకరిస్తా’ అని చెబుతూ రవికుమార్ వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో శనివారం వైరలైంది. ‘తిరుమల పెద్ద జీయర్‌స్వామి మఠంలో గుమస్తాగా పనిచేశాను. నాపై కొందరు ఒత్తిడి తెచ్చి ఆస్తులు కాజేశారనే ప్రచారంలో వాస్తవం లేదు. నా ఆస్తులు ఇతరులకు ఎందుకు ఇస్తాను? కొందరు బ్లాక్మెయిల్ చేసినమాట వాస్తవం’ అంటూ వీడియోలో రవికుమార్ కంటతడి పెట్టారు. ఈ వీడియో విడుదలైన ఓ యూట్యూబ్ ఛానల్లో మాజీ సీఎం జగన్, తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తదితర వైకాపా నాయకుల వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో తాను మహాపాపం చేశానని, ఆ తప్పును తలుచుకుని తానూ, తన భార్యాపిల్లలు బాధపడని రోజు లేదని రవికుమార్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పరకామణి కేసు చిన్నది అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు సెటైర్లు వేశారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాబాయ్ హత్యకేసే చిన్నది అయినప్పుడు పరకామణి కేసు పెద్దదవుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ రెడ్డి తీరు ఉందన్నారు. బాబాయ్ హత్య కేసును సెటిల్ చేయాలనుకున్నట్లుగానే పరకామణి చోరీ కేసునూా సెటిల్ చేయాలని చూశారని విమర్శించారు. చోరీ చేసిన వ్యక్తి డబ్బులు కట్టాడు కదా ఇంక కేసులెందుకని జగన్ అనైతికంగా వాదిస్తున్నాడని.. సెంటిమెంట్ విషయాల్లో సెటిల్మెంట్లు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. దొంగతనాన్ని కూడా తప్పుకాదనేవారిని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

