PRAVEEN CASE: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక మలుపు

PRAVEEN CASE: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక మలుపు
X
మద్యం కొనుగోలు.. మూడు గంటలూ పార్కులో విశ్రాంతి

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు సమగ్రంగా.. లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకొనేందుకు సాంకేతిక ఆధారాల ను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్‌ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీని ద్వారా కీలకమైన ఆధారాలను సేకరించారు. రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్‌ విజయవాడలో ఆగినట్టు పోలీసులు గుర్తించారు.

కీలక ఆధారాలు

పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. పాస్టర్‌ ప్రవీణ్‌ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. అదేరోజు మధ్యాహ్నం కోదాడ లో రూ.650తో మద్యం కొనుగోలు చేసి, ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. సరిగ్గా కంచికచర్ల-పరిటాల మధ్య అదుపుతప్పి పడిపోవడంతో బుల్లెట్‌ హెడ్‌ లైట్‌ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్‌ వంగిపోయాయి. ప్రవీణ్‌ చేతులకు గాయాలయినట్లు తెలుస్తోంది. గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోలు పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్‌ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు పెట్రోల్ బంక్‌ సిబ్బంది పోలీసులకు తెలిపారు. బంక్‌కు రాగానే ఎంత పెట్రోల్‌ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్‌ ఎనిమిది వేళ్లు చూపించారని తెలిపారు. అక్కడ రూ .872 ఫోన్‌ పే చేశారు. అప్పటికే ప్రవీణ్‌ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్‌ బంక్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్‌కు చేరుకున్నారు. ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్‌ బుల్లెట్‌పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

మూడు గంటల విశ్రాంతి

రామవ ప్పాడు రింగ్‌కు పది మీటర్ల దూరంలోనే వోక్స్‌ వ్యాగన్‌ షోరూమ్‌కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్‌పై నుంచి ఆయన పడిపోయారు. ప్రవీణ్‌ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రెయిలింగ్‌ వద్ద కూర్చోబెట్టారు. ఆ తర్వాత బూత్‌ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్‌ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఇన్నోటెల్‌ హోటల్‌ పక్కన ఉన్న టీస్టాల్‌ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్‌ బుల్లెట్‌పై ఏలూరు వైపు బయల్దేరారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్‌ ఎస్‌ఐతో కలిసి పాస్టర్‌ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్‌ హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సుమారు 200 కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు.

Tags

Next Story