అమ్మఒడి సొమ్ము ఆమె పాలిట శాపం..
పేదింటి తల్లికి పిల్లల చదువు భారం కాకూడదని అమ్మఒడి పథకం క్రింద రూ.15,000 జమ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఆ డబ్బును తాగేందుకు ఇవ్వాలని భార్యని వేధించి బండరాయితో మోది చంపేశాడో భర్త. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయితీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యాభర్తలు.
వీరికి నలుగురు పిల్లలు. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం డబ్బు తీసుకుందామని బ్యాంకు వెళ్లిన ఆమెను భర్త వేధించాడు. ఆ డబ్బు తనకు ఇవ్వమని భార్యతో గొడవపడ్డాడు. భర్త చేతికి సొమ్ము ఇస్తే మొత్తం తాగుడుకే ఖర్చు పెడతాడని, పిల్లలను చదివించేందుకు ఉండవని ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈ క్రమంలోనే సంతకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు భార్యా భర్తలిద్దరూ. సంత నించి వచ్చేటప్పుడు దారి పొడవునా భార్యని డబ్బివ్వమని వేధిస్తున్నాడు. ఆమె ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని అనడంతో ఆగ్రహించిన భీమన్న భార్యను బండతో కొట్టి చంపేశాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమన్న మొదట తనకేమీ తెలియదని బుకాయించాడు. కానీ పోలీసులు నాలుగు లాఠీ దెబ్బలు తగిలించడంతో అసలు విషయం బయటపెట్టాడు. తానే భార్యను హతమార్చానని అంగీకరించాడు. పోలీసులు భీమన్నను అరెస్టు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com