Hyderabad-Vijayawada Road: హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు పనులకు అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), జీఎమ్మార్ మధ్య ఒప్పందం కుదిరింది. నూతన గుత్తేదారు ఎంపికయ్యే వరకు, జులై ఒకటి నుంచి ఎన్‌హెచ్‌ఐఏనే టోల్ వసూలు చేస్తుంది.
మొదట్లో రెండు వరుసల్లో ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిన విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండరు పిలిచింది. జీఎమ్మార్ సంస్థ రూ.1740 కోట్లకు టెండర్ వేసి, పనులను స్వంతం చేసుకుంది. యాదాద్రి - భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబరులో పనులను పూర్తి చేసి, తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్‌తో టోల్ వసూళ్ల గడువు ముగుస్తోంది. అయితే, ఈలోపే జీఎమ్మార్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించడం గమనార్హం.
హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే ఆరు వరుసల నిర్మాణానికి సరిపడా భూమిని సేకరించారు. నాడు టెండరు దక్కించుకున్న జీఎమ్మార్ సంస్థే హైవేను 2024 వరకు ఆరు వరుసల్లో విస్తరించాలనేది ఒప్పందం. కానీ.. తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని జీఎమ్మార్ కోర్టును ఆశ్రయించింది. ‘‘అప్పట్లో రవాణా వాహనాలు ముఖ్యంగా ఇసుక కోసం లారీలు ఏపీకి భారీగా వెళ్లేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దాంతో రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది’’ అని పేర్కొంది. ఈ కారణంగా విస్తరణ ఆగిపోయింది. జీఎమ్మార్, ఎన్‌హెచ్‌ఏఐల మధ్య అనేక చర్చల అనంతరం... గడువు కన్నా ముందే టోల్ వసూలు బాధ్యత నుంచి వైదొలగేందుకు జీఎమ్మార్ అంగీకరించింది. దాంతో ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకొంది. ఎంత, ఎప్పటిలోగా చెల్లిస్తుందనే సమాచారం బహిర్గతం కానప్పటికీ రెండు దఫాలుగా ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో మూడు నెలలపాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్ వసూలుకు రెండు ఏజెన్సీలను ఎంపిక చేసింది. పంతంగి, కొర్లపహాడ్‌లలో టోల్ వసూలు బాధ్యతను స్కైల్యాబ్ ఇన్‌ఫ్రాకు అప్పగించింది. చిల్లకల్లులో వసూలు బాధ్యతను కోరల్ ఇన్‌ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com