HYDRAA: పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ కీలక చర్చ

ప్రజల్లో సరైన అవగాహన కల్పించినప్పుడే ఎలాంటి మార్పు అయినా సాధ్యమవుతుందని, ఆ దిశగా తాము విజయం సాధించామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఒకప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పాటైంది, దాని లక్ష్యాలు ఏమిటి అనే విషయాలపై స్పష్టత ఉండేది కాదని, కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి వివరించేంత చైతన్యం వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలు అర్థం చేసుకున్నప్పుడే వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ‘మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణల అవసరం’ అనే అంశంపై గ్రీన్ పార్కు హోటల్లో శుక్రవారం జరిగిన సదస్సులో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి పెద్ద పీట వేస్తుందని అన్నారు. ఆ దిశగా నగరంలో మెరుగైన జీవన విధానాలు పెంపొందించేందుకు హైడ్రా పని చేస్తోందని చెప్పారు. ఆ క్రమంలోనే ఆక్రమణల తొలగింపు.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను పెద్దయెత్తున చేపట్టామని అన్నారు.
ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా నగరాన్ని వరదల నుంచి కాపాడగలిగామని రంగనాథ్ తెలిపారు. చెరువులు, వాటిని అనుసంధానించే నాలాలను కాపాడుకోకపోతే నగరాలు నీట మునగడం ఖాయమని హెచ్చరించారు. ప్యాట్నీ నాలాను విస్తరించి, పూడిక తొలగించడం ద్వారా దాదాపు 7 కాలనీలకు వరద ముప్పు తప్పించామని గుర్తుచేశారు.
పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరిలోని జనసేన క్యాంపు ఆఫీసులో వీరు ఇరువురు భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరిగింది. కాగా.. విజయవాడలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన రంగనాథ్.. మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

