Chandrababu : భయమొద్దు.. చివరి బాధితుడికి సాయం అందే వరకు ఉంటా

వర్షం ఉన్నా.. వరదలొచ్చినా సహాయక చర్యలకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. చివరి బాధితుడి వరకు ఆహారం, తాగునీరు అందేలా చూస్తున్నాం. ఇంకా నీటిలో కొందరు వృద్ధులు, పిల్లలు, రోగులు ఉన్నారు.. వారిని ఇళ్ల నుంచి బయటకు తీసుకొస్తాం. ఎవరూ ఆందోళన చెందకండి. కొద్దిగా ఓపికపడితే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. అన్నీ కుదుటపడే వరకు నేను ఇక్కడే ఉంటా. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం తమ ప్రథమ కర్తవ్యం’ అని వరద బాధితులతో సీఎం చంద్రబాబు అన్నారు. మరోసారి చంద్రబాబు.. సింగ్‌నగర్‌ను పరిశీలించారు. బాధితుల్లో అభద్రతాభావాన్ని పోగొట్టి, వారిలో ధైర్యాన్ని నింపేందుకు ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కూడా కాలినడకన,పడవల్లో, జేసీబీల్లో పర్యటించారు.
గోడు వెళ్లబోసుకున్న బాధితులు
సింగనగర్‌లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలువురు తమ కష్టాలను చంద్రబాబుకు చెప్పుకున్నారు. రోగులు ఉన్నా బండ్లు పంపించడం లేదనీ, రాత్రి నుంచి కరెంటు లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా మాట వినండి. కొంత సమయం ఇవ్వండి. మీ కష్టాలు అర్థం చేసుకున్నా.. అన్నీ గాడిలో పెడతాం. నాకు వదిలిపెట్టండి.. అన్నీ చేస్తాం’ అని సమాధానమిచ్చారు. అక్కడి తీవ్రత చూసి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు నగరంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కలెక్టరేట్‌లోనే ఉంటూ సమీక్షలు కొనసాగించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు సంబంధించి ఆదివారం కేంద్రంతో మాట్లాడారు. పవర్ బోట్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com