AP: నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు

నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలోని కట్టడాలను వారు పరిశీలన చేయనున్నారు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే పనులు నిలిచిపోయిన భవనాలను ఐఐటీ బృందం పరిశీవించనుంది. ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన పనులని స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. ఈ భవనల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి ఏపీ సర్కార్ అప్పగించింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి.. ఏపీలో మూడు రాజధానులను నిర్మించాలని తీర్మానం చేసింది. దీంతో అమరావతిలోని కట్టడాలు పూర్తిగా ఆగిపోయాయి. కాగా, 2024లో మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం.. రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఐఐటీ నిపుణుల బృందం రేపటి నుంచి రెండు రోజుల పాటు అమరావతిలోని బిల్డింగుల సామర్థ్యాన్ని పరిశీలించనుంది.
లోకేశ్ ఆగ్రహం
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.1,600 కోట్ల నిధుల్ని బకాయిపెట్టింది మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డేనని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిందని బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. బకాయిల వ్యవహారాన్ని బయటపెట్టి సాక్షి పత్రిక ‘11’మోహన్ పరువు తీసిందని.. ‘ఆరోగ్యశ్రీ ఆపేస్తాం’ శీర్షికతో ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. ఇంతకీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఏం జరుగుతోందని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com