VIHARI: ఆంధ్రా జట్టుకు ఇక ఆడను

VIHARI: ఆంధ్రా జట్టుకు ఇక ఆడను
మరీ ఇంత రాజకీయ జోక్యమా.. హనుమ విహారి సంచలన ప్రకటన

ఆంధ్రా క్రికెట్‌ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సీనియర్‌ ఆటగాడు హనుమ విహారి తెలిపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా జట్టులో 17వ ఆటగాడ్ని మందలించినట్లు వెల్లడించిన విహారి అతడు రాజకీయ నేత అయిన తన తండ్రి ద్వారా అసోసియేషన్‌పై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. మందలించడం ఆటలో సహజమేనని జట్టు సభ్యులు విహారికి అండగా నిలిచారు. భవిష్యత్తులో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడబోనని సీనియర్ బ్యాటర్ హనుమ విహారి ప్రకటించడం కలకలం రేపింది. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనంటూ .ఆయన సామాజిక మాధ్యమం ఇన్ స్టాలోపోస్టు చేశాడు.


మధ్యప్రదేశ్ తో క్వార్టర్ ఫైనల్ లో 4పరుగుల తేడాతో ఆంధ్రా జట్టు ఓడిన తర్వాత విహారి ఈ మేరకు తెలిపాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఓ రాజకీయ నాయకుడి కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించినా....జట్టు, ఆట పట్ల ప్రేమతో రంజీ సీజన్ ముగిసేవరకు కొనసాగినట్టు తెలిపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్ తో జరిగిన తొలి మ్యాచ్ లో..17వ ఆటగాడిపై అరిచానని విహారి తెలిపాడు. ఆ ఆటగాడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి చెప్పగా ఆయన తనపై చర్యల కోసం ACAపై ఒత్తిడి చేసినట్టు.. విహారి వెల్లడించాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు విజయం సాధించిందని, గొడవ విషయంలో తన తప్పు లేనప్పటికీ కెప్టెన్సీ నుంచి తప్పించారని వివరించాడు. వ్యక్తిగతంగా..తాను ఎవరినీ ఏమీ అనలేదన్న విహారి, గతేడాది మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కుడి చేతికి గాయమైనా... జట్టు కోసం ఎడమ చేతితోనే బ్యాటింగ్ చేసినట్టు..... గుర్తు చేశాడు. భారత్ తరఫున 16 టెస్టులు ఆడిన హనుమ విహారి..కెప్టెన్ గా గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టును ఐదుసార్లు నాకౌట్ కు చేర్చాడు.


మరోవైపు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో హనుమ విహారి తప్పేమీ లేదని జట్టు సభ్యులు తెలిపారు. ఈ మేరకు అందరి సంతకాలతో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. 17వ ఆటగాడిని..... విహారీ అరిచినప్పటికీ, ఆటలో అదంతా అత్యంత సాధారణమని పేర్కొన్నారు. హనుమ విహారిని కెప్టెన్‌గా కొనసాగించాలని లేఖలో ACA కార్యదర్శిని అభ్యర్థించారు. అటు హనుమ విహారి మందలించిన వ్యక్తిని తానేనంటూ పృథ్విరాజ్‌ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఏం జరిగిందో..జట్టు సభ్యులందరికీ తెలుసునని,

వ్యక్తిగత విమర్శలు, బూతులు తిట్టడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. అయితే తన పోస్టులో చివరిగా 'నువ్వు ఇంతకుమించి ఏమీ పీకలేవు సో కాల్డ్‌ ఛాంపియన్‌' అంటూ విహారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సానుభూతి కోసమే.. సామాజిక మాధ్యమంలో ఈ ఆటలు ఆడుతున్నావంటూ... తీవ్రంగా స్పందించాడు.

Tags

Read MoreRead Less
Next Story