ఏపీలో ప్రకంపనలు రేపుతున్న దేవాలయాలు, హిందూ సంస్థలపై దాడి ఘటనలు

దేవాలయాలు, హిందూ సంస్థలపై దాడి ఘటనలు ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి.. వరుస ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నిత్యం ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.. తాజాగా బీజేపీ చలో అమలాపురానికి పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారితీసింది.. ముందు జాగ్రత్తగా పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు.. ఎక్కడికక్కడ నేతలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో పలువురు బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు.. ముందస్తుగా నేతల ఇళ్లకు నోటీసులు అంటించారు.
విజయవాడలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటనతో అక్కడ 30, 144 సెక్షన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందుగానే సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఛలో అమలాపురం కార్యక్రమం చేపడతామన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
చలో అమలాపురం నేపథ్యంలో విశాఖలో బీజేపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఈ అరెస్టులపై బీజేపీ నాయకులు విష్ణుకుమార్ మండిపడ్డారు.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందననారు. అంతర్వేది కార్యక్రమానికి వెళ్లేవారందరినీ అరెస్టు చేస్తారా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు అరెస్టు చేశారు.. చలో అమలాపురం కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన్ను అడ్డుకున్నారు.
తిరుపతిలోనూ ముందస్తు అరెస్టులతో బీజేపీ నేతలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు.. పార్టీ కార్యకర్తలతో కలిసి చలో అమలాపురం బయలుదేరిన బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు.మరోవైపు అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు.. చలో అంతర్వేదికి ఎలాంటి అనుమతులు లేవని, ప్రజలు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com