ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అన్యాయం.. గండికోట నిర్వాసితుల ఆగ్రహం

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అన్యాయం.. గండికోట నిర్వాసితుల ఆగ్రహం
గండికోట జలాశయం నిర్మాణం కోసం ముద్దనూరు, రైల్వే కొండాపురం మండలాలకు చెందిన 22 గ్రామాల ప్రజల భూములు, ఇళ్ల సేకరణ కోసం మొదటి విడత కింద 2007లో నోటిఫికేషన్ జారీ చేశారు..

గండికోట జలాశయం నిర్మాణం కోసం ముద్దనూరు, రైల్వే కొండాపురం మండలాలకు చెందిన 22 గ్రామాల ప్రజల భూములు, ఇళ్ల సేకరణ కోసం మొదటి విడత కింద 2007లో నోటిఫికేషన్ జారీ చేశారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించడంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా పరిహారం చెల్లించకుండా పాలక ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ వచ్చాయి. 2005లో ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు వాసులకు, గండికోట నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి, గండికోటలో 23 టీఎంసీలు నింపుతామని జగన్‌ ప్రకటించారు. జీవో విడుదల చేయడానికి ఆర్నెల్లు.. చెల్లింపులకు మరో ఆర్నెల్లు పట్టింది.. గండికోటలో ఇప్పటికే 13 టిఎంసిల నీరు చేరటంతో నిర్వాసితుల ఇళ్లు ముంపునకు గురయ్యాయి.. చెక్కులు ఇస్తాము ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ తల దాచుకోవాలో తెలియక ఐదు రోజులుగా నిర్వాసితులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారు..

అయితే, సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలు పోలీసులను మోహరించి నిర్వాసితుల పోరాటంపై ఉక్కుపాదం మోపాలని చూడటం బాధితులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచించి తాము పడే బాధలు అర్థం చేసుకోవాలని బాధితులంటున్నారు. ఆర్ &ఆర్ ప్యాకేజీ ఒకే రోజు వెలుగొండ నిర్వాసితులకు 12 లక్షల 50 వేల రూపాయలు, గండికోట నిర్వాసితులకు పది లక్షలు ప్రకటించడం అన్యాయమంటూ వాపోతున్నారు. ఒకే రాష్ట్రంలో ద్వంద పరిహారాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు నిర్వాసితుల ప్రయోజనాలు కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. భూములకు పరిహారం చెల్లించడంలో కాలం చెల్లిన 1894 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం వల్ల ఎకరాకు 60వేల నుంచి మొదలై ఆరు లక్షల వరకు చెల్లిస్తున్నారని.. ప్రస్తుతం ఇదే డబ్బుతో బయట కొనాలంటే ఎకరా 10లక్షలకు కూడా దొరకడం లేదంటున్నారు.

ఓ వైపు బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంపు గ్రామాల ప్రజలు.. ఖాళీ చేయడాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తుండటంపై మండిపడుతున్నారు.. చేసేది లేక రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అనడంతో చర్చలు కూడా విఫలమయ్యాయి.. పునరావాస కాలనీల్లో సౌకర్యాల కల్పనతోపాటు.. నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఊళ్లు వదలిపెట్టి వెళ్లేది లేదంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి కట్టుబడినా బెదిరింపులకు పాల్పడటం అన్యాయమని వాపోతున్నారు.

మరోవైపు గండికోట ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 12 టీఎంసీలకుపైగానే నీరు చేరడంతో ముంపు గ్రామాల్లో బ్యాక్‌ వాటర్‌ పెరిగి ఇళ్లలోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం ఉద్యమం చేస్తున్న తాళ్ల ప్రొద్దుటూరులో పరిస్థితి దారుణంగా ఉంది.. వర్షపునీరు తోడుకావడంతో ముంపు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాక్ వాటర్‌తో విషపురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే, అధికారులు మాత్రం బ్యాక్‌ వాటర్‌ పెరగకుండా ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదులుతున్నామని, ముంపు ప్రాంత వాసులు భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు.. మొత్తంగా ఉన్నఫళంగా ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో వున్నారు గండికోట బాధితులు.

Tags

Read MoreRead Less
Next Story