TG: నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
తెలంగాణలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో క్యాంపస్ లు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి వెల్లడించారు. దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ల నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్ లు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా, అన్ని సౌలతులు ఉండేలా అత్యాధునిక బిల్డింగులను నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం చేసుకోవాలని, స్థలాలు అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు దీటుగా ఈ క్యాంపస్ లు ఉండాలన్నారు. గురుకులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని.. కుల, మత వివక్ష తొలగిపోతుందని భావిస్తోంది. అదే విధంగా గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత సమర్థంగా నిర్వహించేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
సీఎంకు టీచర్ల ధన్యవాదాలు.
వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రమోషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భాషా పండితుల, పీఈటీ టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మోడల్ స్కూళ్ల టీచర్లు 11 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు. 10 వేల ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, డిప్లమా కోర్సు మాత్రమే అర్హత కలిగిన భాషా పండితులను రివర్షన్ చేసి ఉమ్మడి సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పని వేళలు పాత విధానంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com