శ్రీవారి దర్శనం వీఐపీలకు మాత్రమేనా.. సాధారణ భక్తుల సంగతేంటి?

శ్రీవారి దర్శనం వీఐపీలకు మాత్రమేనా.. సాధారణ భక్తుల సంగతేంటి?
తిరుమల శ్రీవారిని దర్శించుకుందాం అనుకునే వారికి సర్వదర్శన టికెట్లు దొరకవు. కోటా రిలీజ్‌ చేయడం ఆలస్యం రోజువారీ 300 రూపాయల

తిరుమల శ్రీవారిని దర్శించుకుందాం అనుకునే వారికి సర్వదర్శన టికెట్లు దొరకవు. కోటా రిలీజ్‌ చేయడం ఆలస్యం రోజువారీ 300 రూపాయల టికెట్లు ఫిల్ అవుతాయి. కాని, సిఫార్సు లేఖలపై దర్శనాలు మాత్రం ఇట్టే అయిపోతాయి. కరోనా సాకు చెప్పి.. భక్తులను నియంత్రిస్తున్న టీటీడీ.. సర్వదర్శనాలు, 300 రూపాయల టికెట్ల కంటే ఎక్కువగా వీఐపీలకు దర్శనాలు చేయిస్తోంది. నిన్న శ్రీవారిని 25వేల 821 మంది దర్శించుకున్నారు. అంటే సుమారుగా 26వేల మంది. వీరిలో సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు నాలుగు వేలు మాత్రమే. రోజువారీ 300 రూపాయల టికెట్‌ కోటా 8వేలే. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల ద్వారా వచ్చే భక్తులు రోజుకు వేయి మంది అనుకున్నా.. మొత్తం కలిపి 13వేల టికెట్లు సామాన్యులకు కేటాయించారు. మరి ఈ లెక్కన మిగిలిన 13 వేల మంది భక్తులు ఎవరు?

నిన్నటి తిరుమల సమాచారాన్ని పరిశీలిస్తే.. దాదాపు సగానికి సగం మంది సిఫార్సు లేఖల మీద వచ్చిన వాళ్లే. కరోనా పేరు చెప్పి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించని తిరుమల తిరుపతి దేవస్థానం.. వీఐపీలను మాత్రం అనుమతిస్తోంది. వారికి సకల మర్యాదలు కల్పిస్తూ, దగ్గరుండి మరీ స్వామి వారి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తోంది. కాని, కొండపైకి రావాలనుకున్న భక్తులను మాత్రం.. టికెట్లు అయిపోయాయని చెప్పి ఆపేస్తున్నారు. 26వేల మంది స్వామిని దర్శించుకుంటే.. అందులో 13వేల మంది సామాన్య భక్తులైతే.. మిగతా 13వేల మంది వీఐపీ కోటా నుంచే వచ్చారంటే ఏమని అర్థం చేసుకోవాలి. అంటే.. స్వామివారి దర్శనం కేవలం వీఐపీలకే పరిమితం చేస్తున్నారనుకోవాలా? ఆ తిరుమలేశుడు అందరివాడు కాదు.. కొందరివాడేనని చెప్పడమా?

పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక కొత్త పాలకమండలి కొలువైన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే, బ్రేక్‌ దర్శనాల పేరుతో రోజుకు 4వేల మంది వస్తున్నారు. ఇప్పుడు జంబో బోర్డులో భాగంగా ఏకంగా 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరు మరికొందరిని సిఫార్సు చేయవచ్చు. ఇలా చూసుకుంటే.. సామాన్య భక్తుల కంటే.. వీఐపీలే కొండపై ఎక్కువ మంది కనిపిస్తారు. స్వామివారి దర్శన వేళల్లో సగానికి పైగా సిఫార్సు లేఖలు పట్టుకొచ్చిన వాళ్లకే సమయం కేటాయిస్తే.. మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి? వాళ్లంతా తిరుమలకు చేరకముందే అట్నుంచి అటే వెళ్లిపోవాల్సిందేనా? ఓవైపు సిఫార్సు లేఖలతో వచ్చిన వాళ్లే సమయమంతా తీసుకుంటుంటే.. సామాన్య భక్తులు క్యూ లైన్లలో మగ్గిపోవాలా?

Tags

Read MoreRead Less
Next Story