ISRO: జయహో ఇస్రో... ప్రశంసల జల్లు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ - 60 వాహకనౌక ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకన్లకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా స్పేడెక్స్ ప్రయోగం చేపట్టారు. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.
ఇస్రోకు సీఎం చంద్రబాబు అభినందనలు
పీఎస్ఎల్వీ సీ–60 ప్రయోగం సక్సెస్ అయినందుకు ఏపీ సీఎం చంద్రబాబు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అభినందనలు తెలిపారు. ఆర్బిటల్ డాకింగ్‌లో భారతదేశ సామర్థ్యాన్ని పెంచేలా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ విజయవంతమైందన్నారు. మనుషులు రోదసి ప్రయాణినికి, ఉపగ్రహాలు మరమ్మతులకు ఇది చాలా కీలకమని కొనియాడారు. ఈ విజయంతో చంద్రయాన్ 4, స్పేస్ స్టేసన్ వంటి కీలక లక్ష్యాలకు భారత్ మరింత చేరువైందన్నారు.
అందుకే PSLV C60 ప్రయోగం ఆలస్యం: ఇస్రో
PSLV C60 రాకెట్ ప్రయోగం వాయిదా పడటంపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ స్పందించారు. ‘అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారితీసింది. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం అయింది. 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్ చేశాం’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోమ్‌నాథ్ వెల్లడించారు.
తెలుగు నేలపైనే...
స్వీయ పరిజ్ఞానం, స్వదేశీ యువ శాస్త్రవేత్తలతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పేస్ డెక్స్.. స్పాడెక్స్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని.. ఇస్రో ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. PSLV సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటివరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక PSLV కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com