Jagananna Vidya Devena: ఫీజులన్నీ బకాయి పెట్టిన జగన్ సర్కార్

Jagananna Vidya Devena: ఫీజులన్నీ బకాయి పెట్టిన జగన్ సర్కార్
అప్పులు తీసుకు చెల్లిస్తున్న సామాన్యులు

చదువే ఆస్తిని పదే పదే చెబుతుంటారు సీఎం జగన్‌ వాస్తవ పరిస్థితిల్లో మాత్రం ఆయన విద్యార్థులపై పగ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఓట్ల కక్కుర్తితో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్నే మార్చేయడంతో తల్లిదండ్రులకు అప్పులే మిగిలాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను నేరుగా కళాశాలల యాజమన్యాలకు చెల్లించే విధానం ఉండేది. తాను ఎన్ని డబ్బులు ఇస్తున్నానో తల్లిదండ్రులకు తెలియాలని అనుకున్నారో.. లేదా ఆ డబ్బులతోనూ ఓట్ల వేట కొనసాగించాలనుకున్నారో కానీ జగన్‌ పగ్గాలు చేపట్టగానే అప్పటివరకూ సాగిన విధానంలో మార్పులు చేశారు. జగనన్న విద్యా దీవెన పేరిట ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం మొదలెట్టారు. గత విద్యా సంవత్సరంలో యువత ఓట్ల కోసం అందులో మళ్లీ మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులు, తల్లుల పేరిట సంయుక్త ఖాతా ఉండాలంటూ నిబంధన పెట్టారు. అలాగైనా నిధులను సక్రమంగా విడుదల చేశారా...? అంటే.. అదీ లేదు. యాజమాన్యాల ఒత్తిడితో మరో మార్గం లేని తల్లిదండ్రులు.. అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వచ్చింది.

విద్యార్థులు, తల్లుల పేరిట సంయుక్త ఖాతా విధానంలో ప్రభుత్వం ఇచ్చే ఫీజులతో కళాశాలలకు సంబంధం లేకుండా పోయింది. దీంతో సర్కారు విడుదల చేసే నిధులతో నిమిత్తం లేకుండా యాజమాన్యాలు వారి విధానంలో ఫీజులు వసూలు చేసుకోసాగాయి. ఫీజు బకాయిలన్నీ కడితేనే..... పరీక్షలకు అనుమతిస్తున్నాయి. దీంతో పేదలు ఎక్కడో చోట అప్పులు తీసుకొచ్చి మరీ చెల్లిస్తున్నారు. గతంలో ప్రభుత్వమే కళాశాలలకు చెల్లించడం వల్ల తల్లిదండ్రులను యజమాన్యాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వ బకాయిలను విద్యార్థులే చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ ఫీజులు కట్టకపోతే హాల్‌టికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులను పరీక్షలకు హాజరు కానివ్వడం లేదు. కొన్ని సందర్భాల్లో ఫీజులు చెల్లించని వారి పేర్లను నోటీసు బోర్డుల్లో పెడుతున్నారు. మరోవైపు చదువు పూర్తయినా.. ఫీజులు పూర్తిగా చెల్లించకపోతే యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇది విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగాలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతి సభలోనూ మాట్లాడే జగన్‌ ప్రేమ నిజమే అయితే.. విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఫీజుల బకాయిలు ఉంచుతారా.....? కుటుంబాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని తెలిసినా కిమ్మనకుండా ఉంటారా.....? అంటూ బాధితులు వాపోతున్నారు. పేదలను ఇబ్బంది పెట్టే జగనే అసలైన పెత్తందారి అంటూ మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story