jaljeevan mission : జలజీవన్ మిషన్ పనుల్లో కమీషన్లు వచ్చే బిల్లులకే చెల్లింపులు

జలజీవన్ మిషన్ పనుల్లో భారీగా కమీషన్లు ఇచ్చే బడా గుత్తేదారులకే బిల్లులు చెల్లించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చిన్న గుత్తేదారులను గాలికొదిలేసి దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన బిల్లులను ఈ సంస్థలకు చెల్లించనుంది. కొత్త ప్రభుత్వం వచ్చేలోగా..బిల్లులు చెల్లించి సొమ్ములు దండుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం చిన్న గుత్తేదారులు ఇప్పటికే అప్‌లోడ్ చేసిన బిల్లులను కొద్ది రోజులుగా తిరస్కరిస్తున్నారు.
విజయవాడలో రాష్ట్ర RWS..శానిటేషన్ గుత్తేదారులు అత్యసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రస్తుతం చేస్తోన్న పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు జారీ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 15 వేల 300కోట్లతో చేపట్టిన జేజేఎం పనులు..రాష్ట్రంలో ఐదేళ్ల కిందట ప్రారంభమయ్యాయి. గుత్తేదారులకు అప్పగించిన 10 వేల 200 కోట్ల విలువైన పనుల్లో 4వేల 200 కోట్ల వరకు పూర్తయ్యాయి. వీటిల్లో 3 వేల కోట్ల చెల్లింపులు చేశారు. జేజేఎం పనులకు 2023-24 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 700 కోట్లు నెలాఖరులోగా విడుదల చేసే అవకాశం ఉందన్న సమాచారంతో..బడా గుత్తేదారు సంస్థల ప్రతినిధులు రంగంలో దిగారు. ప్రభుత్వ పెద్దల ద్వారా తమకు చెందిన పెండింగ్ బిల్లులే చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులూ సహకరిస్తున్నారు. పొడిగించిన ఒప్పంద సమయం దాటాక బిల్లులు పెట్టారన్న కారణంతో చిన్న గుత్తేదారులకు చెందిన బిల్లులను ప్రస్తుతం తిరస్కరిస్తున్న గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు … వీటిని గుత్తేదారులు అప్‌లోడ్ చేసినపుడు ఎందుకు మిన్నకుండిపోయారనేది ప్రశ్న . బిల్లులు చెల్లించే దశలో వీటిని తిరస్కరించడంపై చిన్న గుత్తేదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట అప్‌లోడ్ చేసిన వాటికే తొలుత బిల్లులు చెల్లించే విధానం జేజేఎం పనుల విషయంలో అమల్లో ఉంది. ఆ ప్రకారం చూస్తే 4 నెలల క్రితం బిల్లులు అప్‌లోడ్ చేసిన చిన్న గుత్తేదారులకు మొదట బిల్లులు చెల్లించాలి. వీటిని తిరస్కరించడం ద్వారా బడా గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి పనులు చేస్తే చెల్లింపుల దశలో బిల్లులు తిరస్కరించడంపై చిన్న గుత్తేదారులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు అప్‌లోడ్ చేసిన ప్రకారం చెల్లింపులు చేయాలని గుత్తేదారులు డిమాండ్ చేశారు. 8 నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో సుమారు 800కోట్ల రూపాయలు ఒక్క జలజీవన్ మిషన్ కిందే బకాయిలు నిలిచిపోయాయి. ఈ బిల్లులు ఇవ్వాల్సి వస్తుందని నిబంధనలు మార్చి మోసం చేయాలని యత్నించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com