Janasena And BJP: జనసేన, బీజేపీ మధ్య చిచ్చుకు అదే కారణమా..? పవన్, నడ్డా భేటీపై అనుమానాలు..

Janasena And BJP: జనసేన-బీజేపీ మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం చిచ్చుపెడుతోందా? రెండుసార్లు తగ్గాను ఈసారి తగ్గేదేలే అనే పవన్ మాటల అర్థమేంటి..? పవన్ మూడు ఆప్షన్లపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందిస్తారా..? రెండ్రోజుల పర్యటన కోసం విజయవాడకు వచ్చిన జేపీ నడ్డా ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారు? మరోవైపు పవన్ కల్యాణ్-జేపీ నడ్డా మధ్య భేటీ ఉంటుందా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలని జనసేన నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే, బీజేపీ మాత్రం అలాంటి ప్రకటనలు కుదరవని, అల్టిమేటాలకు తమ పార్టీ తలవంచదంటున్నారు. దీంతో మిత్రపక్షం అంటూనే రెండు పార్టీల నేతలు ఇలా భిన్న ప్రకటనలు చేస్తుండడంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. సీఎం అభ్యర్థిపై జేపీ నడ్డా స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనంటున్నారు జనసేన నేతలు.
పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంగా.. ప్రజలు కోరుకుంటున్నారన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్. విశాఖలో మాట్లాడిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ పేరును ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని పవన్ కల్యాణ్ మాత్రమే సరిదిద్దగలన్నారు. అయితే.. CM అభ్యర్థిపై జేపీ నడ్డా ఇప్పుడే స్పందించాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నేత రమేష్ నాయుడు.
మిగతా రాజకీయ పార్టీలకు ఉన్న తొందర తమకు లేదని, సీఎం అర్హత ఉన్న వ్యక్తులు బీజేపీలో చాలా మంది ఉన్నారంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు రమేష్ నాయుడు. మొత్తానికి రెండు రోజుల పాటు ఏపీలోనే ఉంటున్న జేపీ నడ్డా క్యాడర్‌కు ఏం చెప్తారు..? మిత్రపక్షం అంటున్న జనసేన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో పవన్-జేపీ నడ్డా మధ్య భేటీ ఉంటుందా.. పవన్ చెప్పిన ఆప్షన్స్‌పై చర్చ జరుగుతుందా అన్న సస్పెన్ష్ కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com