JANASENA: పిఠాపురంలో జనసేన ప్లీనరీ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్లీనరీ సన్నాహాలపై శుక్రవారం జనసేన పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశమైన కోర్ కమిటీ వివిధ అంశాలపై చర్చించింది.2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం పవన్ కల్యాణ్ ‘జనసేన’ స్థాపించారని... పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా బలంగా నిలిచారని మనోహర్ అన్నారు.
ప్రభుత్వంలో జనసేన పాత్ర కీలకం
కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని.. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించబోతున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ.. తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొంటామని, ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమిస్తామని … నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, 14న బహిరంగ సభ జరుగుతుందన్నారు.
జనసేన సమన్వయకర్తలతో సమావేశం
అనంతపురం నగరంలోని ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ కార్యాలయంలో శుక్రవారం 14 నియోజకవర్గాల సమస్యలపై సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అహుడ చైర్మన్ టీసీ వరుణ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం పై కూటమి ప్రభుత్వంతో ఎలా ముందుకెళ్లాలని దానిపై నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశా నిర్దేశం చేశారు. గుంతకల్ సమన్వయకర్త మణికంఠ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com