PAWAN: బొకేలు, శాలువాలు వద్దు: పవన్

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి జనసేన అదినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు తెలిపారన్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని చెప్పారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని..., త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాననున్నట్లు వెల్లడించారు. దీనికి త్వరలోనే షెడ్యూలు ప్రకటిస్తామన్నారు. అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనసభ సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ నెల 20వ తేదీ తరవాత పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలవనున్నట్లు చెప్పారు. తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ...ఐదు కీలక ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. 16 వేల 347 పోస్టులతో మెగా DSC ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు 4 వేలకు పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టారు. అంతకుముందు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు రాజధాని రైతులు అఖండ స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కుటుంబసమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. తర్వాత ఉండవల్లిలోని నివాసం వెళ్లిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు వెలగపూడిలోని సచివాలయనికి బయల్దేరగాఅడుగడుగునా అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కరకట్టతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి భారీగా చేరుకున్న రైతులు దారిపొడవునా నిల్చుని సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సచివాలాయనికి వెళ్లే దారిపొడవునా పూలు పరిచి బ్రహ్మరథం పట్టారు. గజమాలలతో అభిమానాన్ని చాటారు. చంద్రబాబు సైతం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com