Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల శంఖారావం..

Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల శంఖారావం..
30 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకనుగుణంగానే పర్యటన షెడ్యూల్‌ రూపొందించాలని నేతలకు పవన్‌ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మూడు విడతలుగా పవన్‌ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు.

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా, టీడీపీ మిత్ర పక్షం జనసేన కూడా సన్నద్ధమవుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కల్యాణ్ మూడు విడతల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించాలని పవన్ తన పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు కారణంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు పరిమితమైన సంగతి తెలిసిందే.

పిఠాపురం వెళ్లిన తొలి రోజున పవన్ శక్తిపీఠమైన పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడే తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని సందర్శించనున్నారు.

తొలుత పిఠాపురం నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలతోనూ పవన్ సమావేశం కానున్నారు. పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్ లో ఇక్కడి బంగారు పాప దర్గా, క్రైస్తవ పెద్దలతో సమావేశం, సర్వమత ప్రార్థనలు కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story