జనంలోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధమైన జనసేనాని

జనంలోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధమైన జనసేనాని

జనసేనాని మళ్లీ జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. లాక్ డౌన్, చాతుర్మస దీక్ష, సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా నేతలతో సమావేశమై జనాల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. మరోవైపు అమరావతి రైతులు, మహిళలతో కూడా పవన్ భేటీ కానుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయంగా బిజీ కానున్నారు. కొన్ని నెలలుగా హైదరాబాద్ కే పరిమితమైన జనసేనాని ఈ నెల 17,18 తేదీలలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పలు సమావేశాలు నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న ఘటనలపై పవన్ స్పందించకపోవడంతో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై కూడా పవన్ స్పందించలేదు. దీంతో పవన్ తమ ఉద్యమానికి పూర్తి మద్దతు పలకాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలతో ఇటీవల జనసేన నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించి వారి అభిప్రాయాలను అధినేత దృష్టికి వెళ్లారు.

దీంతో పాటు రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితి గురించి కూడా నేతలు నివేదికలు అందజేశారు. ఈ నేపథ్యంలో నేతలతో సమావేశం కావాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 17 ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానశ్రయం చేరుకుని నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. 17 ఉదయం 11 గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

ఇక 18వ తేదీ ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, మహిళలు, రైతులతో భేటీ కానున్నారు. అనంతరం 32 నియోజకవర్గాల నేతలతో సమావేశమై పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై చర్చించనున్నారు. రెండు రోజుల సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అమరావతి రైతుల పోరాటంపై జనసేనాని ఎలా స్పందిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story