BALINENI: జగన్ నా ఆస్తులు కాజేశారు: బాలినేని

BALINENI: జగన్ నా ఆస్తులు కాజేశారు: బాలినేని
X
త్వరలో మరిన్ని విషయాలు బయటపెడతా.. జనసేన సభలో బాలినేని కంటతడి

జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. పిఠాపురం సభ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. " జగన్ మీ నాన్న గారి దయవల్ల ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, మళ్ళీ ఇక అవ్వలేవు. పవన్ కళ్యాణ్ గారు స్వశస్తిగా ఎదిగి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా ఎదుగుతారు" అని బాలినేని అన్నారు. జగన్ చేసిన అరాచకాలను త్వరలోనే బయటపెడతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలే చెబుతానంటూ ప్రసంగం ఆవిర్భవించిన బాలినేని... జగన్‌ తన ఆస్తులనూ కాజేశారని కంటతడి పెట్టుకున్నారు. తనకు జరిగిన అన్యాయం ఒక్కరోజు చెబితే సరిపోదన్నారు. జగన్‌ చేసిన అన్యాయాలన్నీ త్వరలోనే చెబుతా అని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ‘మా నాన్న ఇచ్చిన ఆస్తిలో సగంపైనే అమ్ముకున్నాను.. లెక్క చేయలేదు. సవాల్‌ చేస్తున్నా. అప్పటి ఎమ్మెల్యేలందరిపైనా విచారణ వేయండి. నామీదా వెయ్యండి. ఎవరు తప్పు చేశారో, రూ.కోట్లు సంపాదించారో తేలుతుంది. ఈ ఉక్రోషం, బాధ నాకు, నా కుటుంబానికి తెలుసు.’ అని బాలినేని అన్నారు.

పవన్ తో సినిమా తీస్తా

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన కోరిక అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సినిమా తీయాలని ఉందన్న విషయం పవన్ కు కూడా చెప్పానని వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చాక తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశానని.. జగన్‌ వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డామని బాలినేని పేర్కొన్నారు. ‘17 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వల్లభనేని వంశీ, సీనీ నటుడు పోసాని అరెస్ట్ చేస్తే జగన్ వెళ్లి పరామర్శించారు, మరి గతంలో తనని ఏదో చిన్న మాట అన్నారని రఘురామ కృష్ణం రాజును జైల్లో పెట్టించి, కాళ్లు చేతులు విరగ్గొట్టించావు. నీకు ఉన్న బాధ చంద్రబాబుకు ఉండదా? జగన్’ అని ప్రశ్నించారు.

దేశానికి కూడా ఉపయోగపడేలా పవన్‌ ఎదగాలి: నాదెండ్ల

ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. 'రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా ఉపయోగపడేలా పవన్‌ ఎదగాలి. అధికారులతో కలిసి పేదలకు పథకాలు అందేలా జన సైనికులు కృషి చేయాలి. ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి మనం ఎదిగాం. మన అడుగులు ఎప్పుడూ సామాన్యుడివైపే నడుస్తాయి. ’ అని నాదెండ్ల అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టిన రోజులను మర్చిపోలేమని నాదెండ్ల మనోహర్ అన్నారు. 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నో అవమానాలను... అవహేళనలను ఎదుర్కొన్నామని గుర్తు చేసుకున్నారు. పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని అని నాదెండ్ల అన్నారు. తనతో పాటు నిలబడిన ప్రతీ ఒక్కరిని పవన్ గౌరవించారని నాదెండ్ల అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎంతో శ్రమించామని తెలిపారు.

Tags

Next Story