Nadendla Manohar: విశాఖలో జనసేన ధర్నా - నాదెండ్ల మనోహర్ అరెస్ట్

విశాఖపట్నంలోని టైకూన్ సెంటర్ మూసివేతపై వివాదం కొనసాగుతోంది. అధికార పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంకోసమే ఏకంగా రోడ్డునే మూసేయడం దారుణమని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఈ రోడ్డు మూసివేతకు నిరసనగా జనసేన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టైకూన్ సెంటర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.
జనసేన ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నోవాటెల్ గేట్లు మూసేసి నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర జనసేన నాయకులెవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టైకూన్ జంక్షన్ కు వెళ్లేందుకు అనుమతి లేదని నాదెండ్లకు పోలీసులు సూచించారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో నాదెండ్ల మనోహర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుండి తరలించారు. అనంతరం జనసేన నాయకులను కూడా చెదరగొట్టారు.
టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్మా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియలెస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా? అని ప్రశ్నించారు.
తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని... శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com