ఏపీ పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కోరుతూ హైకోర్టుకెళ్లిన జనసేన

ఏపీ పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కోరుతూ హైకోర్టుకెళ్లిన జనసేన
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది జనసేన.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది జనసేన. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక చర్చ అంతా మున్సిపల్ ఎన్నికల మీదే చర్చ జరుగుతోంది. దీంతోపాటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సైతం జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ అది అమలయ్యేలా కనిపించడం లేదని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతేడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. జనసేన నేతలను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పవన్‌ ఆరోపించారు. కలెక్టర్లు తమ కింది స్థాయి అధికారులతో పేరుకే ఫిర్యాదులు తీసుకుని పంపించేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో ఆలోచించడం లేదన్నారు. అధికారుల తీరుతో ఆ ప్రక్రియపై నమ్మకం పోయిందని అన్నారు. ఫిర్యాదుల వరకు న్యాయం చేస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇచ్చిన హామీ అమలయ్యే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదన్నారు పవన్. తాజా నోటిఫికేషన్‌ విడుదల చేస్తే తప్ప న్యాయం జరగదని పవన్‌ అభిప్రాయపడ్డారు.

మున్సిపల్ ఎన్నికలకు సమయం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించలేకపోయామని, అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమయం ఉండడంతో కోర్టును ఆశ్రయించామని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ జనసేన పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. తమ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని కోరుకుంటున్నామని తెలిపారు.

గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తోంది జనసేన. ఈ నేపథ్యంలో... తాజా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని నాదెండ్ల స్పష్టం చేశారు. యువతకు ఎక్కువ అవకాశాలు రావాలంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉండాలని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ ఆదరణ లభించిందన్న నివేదికతో... ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. అందుకే, పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది జనసేన.


Tags

Read MoreRead Less
Next Story