AP: రసవత్తరంగా ప్రజాపద్దుల సంఘం ఎన్నిక

AP: రసవత్తరంగా ప్రజాపద్దుల సంఘం ఎన్నిక
X
తగినంత బలం లేకపోయిన పోటీకి వైసీపీ మొగ్గు... జనసేన ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులకు పీఏసీ ఛైర్మన్ పదవి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల సంఘం ఎన్నిక రసవత్తరంగా మారింది. తగినంత బలం లేకపోయినా ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు.. ఈ కమిటీ చైర్మన్‌ పదవికి జనసేనకు చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును అంతర్గతంగా ఖరారు చేశాయి. అయినా పెద్దిరెడ్డి పోటీలో కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ఖాయమవడంతో అసెంబ్లీ అధికారులు ఓటింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ వేదికగా పనిచేసే కమిటీల్లో పీఏసీ కీలకమైనది. వివిధ ప్రభుత్వ శాఖలు పెట్టే ఖర్చుకు సంబంధించి కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది. ఏ శాఖకు చెందిన అధికారులనైనా పిలిచి సమీక్ష నిర్వహించే అధికారం దీనికి ఉంది. శాసనసభలో అనేక కమిటీలు ఉన్నా ఈ ఒక్క కమిటీ చైర్మన్‌ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్‌కు చైర్మన్‌ పదవి ఇచ్చారు. అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది.ఈసారి వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు. ఒక సభ్యుడిని గెలిపించుకోవడానికి అవసరమైనంత బలం కూడా ఆ పార్టీకి లేదు. ఈ విషయం తెలిసినా కూటమి పార్టీలతో సంప్రదింపులు జరపకుండా పెద్దిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చంద్రశేఖర్‌ కూడా వచ్చారు.

బలం లేకపోయినా వైసీపీ బరిలోకి...

బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడంపై కూటమి నేతలు చర్చించారు. ఆ పార్టీని పట్టించుకోవలసిన అవసరం లేదని, సంఖ్యాబలం ప్రకారం వెళ్దామని నిర్ణయించారు. ఇటీవల గుజరాత్‌లో ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వని విషయాన్ని గుర్తుచేసుకున్నారు. గుజరాత్ శాసనసభలో 182 మంది సభ్యులు ఉండగా.. స్వతంత్రులతో కలిసి బీజేపీకి 163 మంది ఉన్నారు. కాంగ్రె్‌సకు 12, ఆమ్‌ ఆద్మీ పార్టీకి నలుగురు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పీఏసీకి ఒక్కరిని కూడా గెలిపించుకునే బలం కాంగ్రె్‌సకు లేకపోవడంతో ఆ పార్టీకి పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వలేదు. అదే సంప్రదాయాన్ని ఆంధ్రలో కూడా పాటించాలని కూటమి నేతలు నిశ్చయించారు. ఆ తర్వాత శాసన మండలి ఛైర్మన్‌ చాంబర్లో శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌, మండలిలో ప్రతిపక్షమైన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. చాలినంత సంఖ్యాబలం వైసీపీకి అసెంబ్లీలో లేనందువల్ల ఆ పార్టీకి పీఏసీ చైర్మన్‌ పదవి గానీ, సభ్యత్వం గానీ ఇవ్వలేమని కేశవ్‌ చెప్పారు.

సంప్రదాయం పాటించాలన్న వైసీపీ

సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వాలని, దానిని పాటించాలని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కోరారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇటీవల స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వైసీపీ నుంచి మీరు పోటీ చేశారు. బలం లేదని మేం అసలు పోటీయే చేయలేదని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. బోత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అసెంబ్లీలో మీ పార్టీకి కనీసం ఒక సభ్యుడిని గెలిపించుకునేంత బలం ఉంటే తామే తప్పనిసరిగా చైర్మన్‌ పదవి ఇచ్చేవాళ్లమని అన్నారు. మీకు ఆ బలం లేదని... ప్రతిపక్ష హోదా కూడా లేదని గుర్తు చేశారు. అందువల్ల ఇవ్వలేకపోతున్నామని కేశవ్‌ స్పష్టం చేశారు. ఆ సమావేశం అనంతరం కూటమి నేతల అంతర్గత సమావేశంలో పీఏసీ చైర్మన్‌ పదవిని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు.

Tags

Next Story