jawad cyclone : జవాద్ రూపంలో ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు..!

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరో గండం పొంచి ఉంది. జవాద్ రూపంలో మరో తుఫాన్ ముప్పు ఏపీ ఉత్తరకోస్తాంద్ర వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్‌లో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరాన.. పారాదీప్‌కు ఆగ్నేయంగా ప్రస్తుతం కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది. వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తున్నట్లు ప్రకటించింది.
అండమాన్‌లో కేంద్రీకృతమైన వాయుగుండం....పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. వాయువ్య దిశగా పయనించి శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీవ్ర తుఫాన్ దృష్ట్యా ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలం దృష్ట్యా... మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాయుగుండం ప్రభావంతో....ఇవాళ అర్ధరాత్రి నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్లతో..శనివారం ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఒకటి.. రెండుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది.అటు తెలంగాణాలోనూ వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.
అటు భారీ వర్షాల దృష్ట్యా... విజయనగరం జిల్లాలో రెండ్రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్..తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. శ్రీకాకుళం,తూర్పుగోదావరి జిల్లాల్లోనూ స్కూల్‌లకు సెలవిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈనెల 5 వరకు విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా ఇవాళ్టి నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com