JOBS: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర

JOBS: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల జాతర
X
భారీగా నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్.. ఇప్పటికే వెలువడ్డ బహిరంగ ప్రకటన

ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న.. తెలుగు యువత నిరీక్షణకు ఇక ముగింపు సమయం దగ్గరపడుతోంది. కలల ఉద్యోగానికి దారి చూపే భారీ ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఉద్యోగాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభవార్త చెప్పారు. త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన రాబోతోందని స్పష్టంగా చెప్పేశారు. నిరుద్యోగులూ.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయ్యొద్దని కూడా దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు కసరత్తు పూర్తి చేస్తుండగా, నోటిఫికేషన్ తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది పరీక్ష సమయం.look

ఆంధ్రప్రదేశ్ లో ఇలా...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్యోగాల ప్రకటనపై కీలక ప్రకటన చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ.. ఇటు తెలంగాణలోనూ భారీ ఉద్యోగాల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రులే ఈ ప్రకటన చేయడంతో వీలైనంత త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించింది. ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహించింది. మరోసారి కూడా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్లలోనూ భారీగానే పోస్టులు ఉన్నాయని తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మరో డీఎస్సీ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ నెల 10 నుంచి టెట్ నిర్వహించబోతున్నారు. అంటే జనవరిలోనే ఏపీ ప్రభుత్వం మరో డీఎస్సీ వేసే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ తో పోలీస్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. పోలీసు శాఖలోని వివిధ క్యాడర్లలో మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఖాళీల భర్తీ విషయంలో వచ్చే ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించింది. దీంతో పోలీస్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం పోస్టుల్లో సివిల్ ఎస్సై పోస్టులు 315, సివిల్‌ కానిస్టేబుల్ పోస్టులు 3,580, రిజర్వ్ ఎస్పై పోస్టులు 96, ఏపీఎస్పీ పోస్టులు 2,520 లతో పాటు మరిన్ని ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది.

తెలంగాణలో ఇలా..

తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌ తీపి కబురు చెప్పారు. రాబోయే 30 నెలల్లో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. త్వరలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. రెండున్నరేళ్ల పాలనలో మొత్తం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో నిరుద్యోగులలో ఆశలు మళ్లీ చిగురించాయి. త్వరలో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఊపిరి పోసింది. అంటే ఇటు తెలంగాణలో కూడా వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. గతంలో డీఎస్సీ పెట్టినప్పుడే మళ్లీ డీఎస్సీ నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అంటే మరోసారి డీఎస్సీ నిర్వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీలో మొత్తం 9,735 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం కేవలం 5,763 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీని ప్రకారం.. సుమారు 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు టీజీపీఎస్సీ ఈ నెలలోపే కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధపడుతుంది. అగ్రికల్చర్, విద్యా శాఖల నుంచి అవసరమైన వివరాలు సేకరించింది. అంతేకాకుండా కొత్త రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్ల సమాచారాన్ని కూడా సేకరించింది. దీంతో వరుస నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. పోలీస్ శాఖలో మొత్తం 17 వేల ఖాళీలు ఉన్నాయి. గురుకులాలు... ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

విద్యార్థులు ఇలా..

కాబట్టి నిరుద్యోగులు, విద్యార్థులు ఇక ప్రిపరేషన్ లో మునిగిపోవాలి. ఎందుకంటే ఇది ఆలోచించే సమయం కాదు… అడుగు వేయాల్సిన సమయం. కాలాన్ని వాయిదా వేసుకుంటూ కలలను కూడా వాయిదా వేయకండి. భారీ ఉద్యోగ ప్రకటన త్వరలోనే వెలువడబోతోంది. ఈ ప్రకటన సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే అవకాశంగా మారుతుంది. సమయం ఎవరికీ మళ్లీ రాదు. ఈ రోజు చదివిన పేజీనే రేపటి మీ ఉద్యోగానికి కారణం కావచ్చు. కాబట్టి సోషల్ మీడియా, అనవసర అలసత్వం పక్కనపెట్టి పుస్తకాన్ని స్నేహితుడిగా మార్చుకోవాల్సిన తరుణం ఇది. ఆగిపోయిన వారికి అవకాశాలు ఎదురుచూడవు… ముందుకు సాగిన వారికే భవిష్యత్తు తలుపులు తెరుస్తాయి.

Tags

Next Story